Andhra PradeshHome Page SliderNewsNews Alert

లక్కవరంలో అరుదైన పుంగనూరు లేగదూడ.. ఆకర్షణగా ‘మహాలక్ష్మి’

కోనసీమ జిల్లా (ఏడీఎన్ఎన్) – డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం లక్కవరం గ్రామంలో అరుదైన పుంగనూరు జాతికి చెందిన లేగదూడ జన్మించింది. కేవలం 12 అంగుళాల పొడవుతో పుట్టిన ఈ బుజ్జి దూడ ప్రస్తుతం స్థానికులతో పాటు పశుప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు జాతుల్లో ఒకటిగా పేరొందిన పుంగనూరు జాతికి చెందిన ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు లక్కవరం గ్రామానికి వస్తున్నారు. చిన్న పరిమాణం, ముద్దులొలికే రూపంతో ఈ దూడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గత నెల జూన్ 20న జన్మించిన ఈ లేగదూడ కుటుంబ సభ్యులతో త్వరగా కలిసిపోయింది. ముఖ్యంగా ఇంట్లోని చిన్నారి వర్షిణితో ఎంతో అనుబంధం పెంచుకుని రోజంతా ఆమెతో కలిసి ఆడుకుంటోంది. వర్షిణి కూడా ఈ దూడను ప్రేమగా ఎత్తుకుని మురిసిపోతుండగా, ఆ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమ ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చిందనే భావనతో ఈ లేగదూడకు ‘మహాలక్ష్మి’ అని పేరు పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ గ్రామంలో ఇలాంటి అరుదైన పుంగనూరు దూడ జన్మించడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుల దూడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.