24 గంటల్లో కిడ్నాపర్ల అరెస్ట్
బాపట్ల: జిల్లాలో కలకలం రేపిన ఆరు నెలల పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును అపహరించిన ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ‘360 సీసీ క్యామ్స్’ యాప్‌తో పాటు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సేకరించిన ఆధారాల ద్వారా నిందితుల కదలికలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న ఆరు నెలల చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
చిన్నారి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేరడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కేసును వేగంగా ఛేదించిన బాపట్ల జిల్లా పోలీసుల పనితీరును ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు.
సాంకేతికతను సమర్థంగా వినియోగించి క్లిష్టమైన కేసును తక్కువ సమయంలో పరిష్కరించడం పోలీసుల నైపుణ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగిస్తూ పనిచేస్తామని పోలీసులు వెల్లడించారు.

