విరాళాల లెక్కలు వెల్లడించాలి: మహువా
అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
రాముడి పేరుతో ప్రజల నుంచి సేకరించిన విరాళాలు, బంగారం, వెండి వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఆమె కోరారు. తాము సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే బీజేపీ నేతలు ఆలయ నిధుల వ్యవహారంపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ బిల్లుపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలపై కూడా మహువా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకునే రాజకీయాల్లో బీజేపీ నిమగ్నమైందని ఆరోపించారు.
అలాగే టెట్, నీట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలపై కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే రాజకీయాల కంటే ప్రజాధనానికి సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె సూచించారు. రామమందిర విరాళాల వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని మహువా మొయిత్రా కోరారు.

