crimehome page sliderNationalNews

‘రేరెస్ట్ ఆఫ్ రేర్’ కేసు.. ఉరి ఖరారు

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణదండన ఖరారు చేస్తూ, దీనిని “అత్యంత అరుదైన కేసు”గా పరిగణించింది. నిందితుడి వయస్సు శిక్ష తగ్గింపునకు ఏమాత్రం కన్సిడర్ చేయమని కోర్టు స్పష్టం చేసింది.

నస్రాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, దూడను చూపిస్తానని చెప్పి బాలికను ఓ పశువుల షెడ్డులోకి తీసుకెళ్లిన భీమ్‌రావ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపడుతుందనే భయంతో బండరాయితో తలపై బలంగా మోది హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, పశువుల షెడ్డులో ఆమె మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వేగంగా విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష విధించింది.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీయగా, విచారణను వేగవంతం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.