Breaking Newshome page sliderHome Page SliderNational

అయోధ్య రామాలయం విరాళాల్లో భారీ కుంభకోణం

రూ. 200 కోట్ల గోల్‌మాల్‌పై ‘సిట్’ నివేదిక

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు తేలింది. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఈ నివేదికను యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేసింది. ఈ కుంభకోణం విలువ రూ. 200 కోట్లకు పైనే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

150 మందిని ప్రశ్నించిన సిట్
జనవరి-ఫిబ్రవరి 2025లో జరిగిన మహా కుంభమేళా సమయంలో రోజుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు రావడంతో, ఆ సమయంలోనే భారీగా వచ్చిన నగదును పక్కదారి పట్టించినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్లే ఈ గోల్‌మాల్ జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ట్రస్టు సిబ్బంది, బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఉద్యోగులతో సహా దాదాపు 150 మందిని సిట్ ప్రశ్నించగా.. విలువైన కానుకల లెక్కలపై కొందరు ఆఫీస్ బేరర్లు ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తేలింది.

అక్రమార్కులపై కేసు నమోదుకు సిఫారసు
ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన విచారణ జరపాలని, దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని సిట్ సిఫార్సు చేసింది. ఇప్పటికే ఐదుగురు అనుమానితుల నుంచి రూ. 2 కోట్ల నగదు, ఒక ఎస్‌యూవీ వాహనం, 3 ఐఫోన్లను రికవరీ చేయడంతో పాటు, పాత సిబ్బంది అందరినీ విధుల నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాబోయే 10 నుంచి 15 రోజుల్లో పూర్తి స్థాయి తుది నివేదికను అందజేస్తామని సిట్ ప్రతినిధులు తెలపగా.. దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.