Breaking Newshome page sliderHome Page SliderTelangana

కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి

కేంద్రంతో మంత్రుల చర్చలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ స్థాపనలో చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో సివిల్ ఏవియేషన్ శాఖ తరపున ఫీజిబులిటీ సర్వే నిర్వహించినందుకు కేంద్ర మంత్రికి, మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు . ఆ సర్వేలో ఒక స్థలం అనువుగా లేదని తేలడంతో, ప్రభుత్వం ఇప్పుడు మరో స్థలాన్ని ప్రతిపాదించిందని వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన స్థలంలో త్వరగా ఫీజిబులిటీ సర్వే పూర్తి చేసి, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని మంత్రులు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు పట్టాలెక్కడం వల్ల ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామికంగా, ఆర్థికంగా జిల్లా మరింత పుంజుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భద్రాద్రి రాముని ప్రాముఖ్యతను వారు కేంద్ర మంత్రికి వివరించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ రావడం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి, భక్తుల రవాణా సౌకర్యాలకు ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతో కీలకం కానుందని మంత్రులు తుమ్మల మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.