టీడీపీలో మహిళలకు 33% సీట్లు
మహానాడు వేదికగా నారా లోకేశ్ ప్రకటన
తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినా, రాకపోయినా రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున మహిళలకు ఖచ్చితంగా 33 శాతం స్థానాలు కేటాయిస్తామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామన్నారు. అంతకుముందు సోషల్ మీడియాలో ‘బిగ్ అనౌన్స్‌మెంట్’ అంటూ పెట్టిన పోస్టుకు అనుగుణంగానే మహానాడు ప్రతినిధుల సభలో లోకేశ్ ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వైఖరిపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక గతంలో నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను ఆ పార్టీ నాయకులు వేధించి చంపేశారని ఆరోపించారు. తన సోదరిని వేధించవద్దని కోరిన అమర్‌నాథ్‌గౌడ్‌ను కిరోసిన్ పోసి దారుణంగా దహనం చేశారని, దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి ఎమ్మెల్సీ ఇంటికే డోర్ డెలివరీ చేశారని మండిపడ్డారు. తాము ‘గొడ్డలి పార్టీ’ అని పిలిస్తే వైసీపీ నేతలకు ఎందుకు కోపం వస్తోందని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అభివృద్ధికి మారుపేరైతే, వైసీపీ ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. “మాది గూగుల్.. మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్. మాది ‘కియా’ కార్ల పరిశ్రమ అయితే.. మీది ‘కిడ్నాప్’ల సంస్కృతి” అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై వైసీపీ నేతలతో ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. నాయకులెవరైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు రాబోయే రోజుల్లో సముచిత స్థానం దక్కుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.

