NEET UG 2026 రద్దు..త్వరలోనే రీ-ఎగ్జామ్!
దేశవ్యాప్త వైద్య విద్యా ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET-UG 2026)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు బలమైన ఆధారాలు లభించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో, పరీక్ష పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కేంద్రం సీబీఐ (CBI)ని ఆదేశించింది. రద్దయిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నారు. కొత్త పరీక్ష తేదీలను NTA అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తుంది. రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్ళీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయి.
ఈ ఏడాది నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నప్పటికీ, అర్హులైన విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

