Andhra PradeshBreaking NewsPolitics

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో సరికొత్త రికార్డు


వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో అసాధారణ వేగం ప్రదర్శిస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఫైళ్ల పరిష్కారానికి గంటల తరబడి సమయం పట్టేది, కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు తన పనితీరుతో పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు.గతంలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌కు 5 గంటల సమయం తీసుకునే వారు. అయితే, ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వస్తున్నప్పటికీ, మంత్రి అచ్చెన్నాయుడు సగటున కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే వాటిని పరిష్కరిస్తున్నారని అధికారులు వెల్లడించారు. రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి ఫైళ్ల పరిష్కారాన్ని తీసుకురావడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రదర్శిస్తున్న ఈ వేగం, పారదర్శకతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల పట్ల కట్టుబాటుతో, సమర్థవంతంగా ఫైళ్లను క్లియర్ చేస్తున్న అచ్చెన్నాయుడిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయ , అనుబంధ శాఖల పరిపాలనను మరింత చురుగ్గా మారుస్తున్నారని ప్రశంసించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే పరమావధిగా అచ్చెన్నాయుడు తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మంత్రి చూపిస్తున్న ఈ పనితీరు వ్యవసాయ శాఖలో ఫైళ్ల జాప్యాన్ని పూర్తిగా నివారించడమే కాకుండా, రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలు త్వరితగతిన అమలయ్యేలా దోహదపడుతోందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.