తమిళ కింగ్ విజయ్ దళపతికి వీసీకే షాక్
- సందిగ్ధంలో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ఉత్కంఠ మళ్లీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనుకునేలోపే టీవీకేకి వీసీకే, ఐయూఎమ్ఎల్ అధికారిక లెటర్స్ ఇవ్వకపోవడంతో శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం లేదని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మెజారిటీ మార్కుకు దూరంగా ఉన్న టీవీకేకి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇచ్చినా.. వీసీకే ప్రాణవాయువు అందించడంలో వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ బ్రేక్ పడింది.
స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం..
మద్దతు ప్రకటించిన పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. టీవీకేకు 107 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు 5, సీపీఐకి 2, సీపీఎంకు 2, వీసీకేకి 2 ఐయూఎమ్ఎల్ కు 2 స్థానాలు ఉన్నాయి. అయితే వీసీకే, ఐయూఎమ్ఎల్ వెనక్కు వెళ్లడంతో 116 మార్కును టీవీకే కూటమి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 117 కు ఇంకా ఒక ఎమ్మెల్యే మద్దతు కావాలి. ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తేనే విజయ్ కు సీఎం పదవి దక్కతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినప్పటికీ, తాము మంత్రివర్గంలో చేరబోమని వామపక్షాలు స్పష్టం చేశాయి. కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని సీపీఎం నేత యు. వాసుకి మీడియా సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీలో బలపరీక్ష సమయం వచ్చినప్పుడు టీవీకేకి అనుకూలంగా ఓటు వేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వతంత్రంగా పనిచేస్తామని ఆమె తెలిపారు. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం, ప్రజల ఐక్యత వంటి అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీలు వెల్లడించాయి.
మిత్రపక్షాలకు విజయ్ కృతజ్ఞతలు
శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్, తనకున్న సంఖ్యాబలంతో కూడిన లేఖలను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి పొందారు. తనకు మద్దతు నిలిచిన మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయ్ నేరుగా సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లారు. ఆయా పార్టీల అగ్రనేతలను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. లౌకికవాద ప్రభుత్వం ఏర్పాటు కావడానికి వామపక్షాల సహకారం కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తమిళ రాజకీయాలకు కేరాఫ్…విజయ్!
విజయ్ నివాసం ఇప్పుడు తమిళ రాజకీయాలకు కేరాఫ్ గా మారింది. ఉదయం నుంచి వామపక్ష నేతలు, వీసీకే ప్రతినిధులు విజయ్‌తో వరుస భేటీ అయ్యారు. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే తిరుగుతున్న తమిళనాడు రాజకీయం ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం వైపు మళ్లింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, తొలి ప్రయత్నంలోనే కోటను కొల్లగొట్టడం విజయ్ ఛరిష్మాకు నిదర్శనం. యువత, సామాన్య ప్రజల మద్దతుతో పాటు ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల అండ కూడా తోడవడంతో విజయ్ పాలనపై అంచనాలు మరింత పెరిగాయి.
మిత్ర పక్షాల ఆకాంక్షలు.. ప్రజల హామీల కోసం…
ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైనా.. సంకీర్ణ ధర్మాన్ని పాటించడం విజయ్‌కి మొదటి సవాలు కానుంది. ముఖ్యంగా మద్దతు ఇచ్చిన పార్టీల ఆకాంక్షలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ వ్యూహాలను ఎదుర్కోవడం కూడా టీవీకేకి అంత సులభమేమీ కాదు. భవిష్యత్ మాట ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం తమిళనాట ‘విజయ్ నామస్మరణ’ మార్మోగుతోంది.

