Breaking NewsHome Page Sliderhome page sliderNational

రాఘవ్ చద్దాకు ఆప్ షాక్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో పార్టీ గళాన్ని బలంగా వినిపించే ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ పక్ష ఉప నాయకుడి బాధ్యతల నుంచి ఆ పార్టీ అధిష్టానం తప్పించింది. ఈ మేరకు చద్దాను తొలగించాలని కోరుతూ రాజ్యసభ సెక్రటేరియట్‌కు పార్టీ లేఖ రాసింది. ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన మరో ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్‌ను నియమించాలని ఆప్ ప్రతిపాదించింది.

పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న చద్దాపై పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజ్యసభలో పార్టీకి కేటాయించే సమయంలో చద్దాను ప్రసంగించనివ్వవద్దని కూడా పార్టీ కోరినట్లు సమాచారం. ఇది పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గుతోందనే సంకేతాలను ఇస్తోంది.

ఈ అనూహ్య పరిణామంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కూడా రాఘవ్ చద్దా పేరు కనుమరుగు కావడంతో, పార్టీ అంతర్గత విభేదాలు ముదిరాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చద్దాను దూరం పెట్టడం వెనుక అసలు కారణమేంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు.. ఇది ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీ తీసుకున్న నిర్ణయమని కొందరు విశ్లేషిస్తుండగా, మెజారిటీ వర్గం మాత్రం చద్దాపై పార్టీ గుర్రుగా ఉందని భావిస్తోంది. పార్టీ అధికారికంగా దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒకప్పుడు పార్టీకి ట్రబుల్ షూటర్‌గా ఉన్న నాయకుడిపై ఇలాంటి ఆంక్షలు విధించడంతో ఆప్ వర్గాల్లో కలకలం రేపింది.