మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్డేట్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, మరో మూడు రోజుల్లోనే వీటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, ప్రజా ప్రభుత్వంలో భాగంగా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై పార్టీ కట్టుబడి ఉందని, దీనిపై ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి ఓబీసీ మహాసభను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరగనున్న నేపథ్యంలో, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసరాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అడ్డుపడుతోందనే అంశాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

