స్పీకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇటీవల స్పీకర్ ‘క్లీన్ చిట్’ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఇప్పటికే ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం జత చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌పై సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరిలో జరగబోయే విచారణలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

