Andhra PradeshHome Page SliderNewsNews Alert

యువత దేశాభివృద్ధికి తోడ్పడాలి: రాష్ట్రపతి

విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయగా, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువత తమ వినూత్న ఆలోచనలు, నైపుణ్యాలతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

నాణ్యమైన విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాదని, అది జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని ఆమె పేర్కొన్నారు. విద్య వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ పురోగతికీ దోహదపడుతుందని చెప్పారు.

గిరిజన సంప్రదాయాలు దేశానికి విలువైన వారసత్వమని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్రపతి అన్నారు. అదే సమయంలో గిరిజన యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు. సంప్రదాయ విలువలను కాపాడుకుంటూనే నవీన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.