తేజస్వి.. 32 ఏళ్ల కింగ్ మేకర్
బిహార్ 8వ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ అధినేత 71 ఏళ్ల నితీశ్ కుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు 32 ఏళ్ల తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఏడేళ్ల క్రితం 25 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తేజస్వి అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని నిర్వహించారు. 2015లో నితీశ్ 5వ మంత్రి వర్గంలో ప్రజాపనులు, అటవీ, పర్యావరణ శాఖను పర్యవేక్షించారు. ఇప్పుడు మళ్లీ కింగ్ మేకర్‌గా, నితీశ్‌కు అసిస్టెంట్‌గా బిహార్ రాజకీయ తెరపైకి వచ్చారు.
2020 ఎన్నికల్లో మహా కూటమి తరఫున సీఎం అభ్యర్థి
ఒకానొక దశలో బిహార్‌ను శాసించిన లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజకీయ ఉద్ధండుడు నితీశ్ కుమార్, బీజేపీలకు గట్టి పోటీ ఇచ్చారు. ఈ నవ యువకుడి సారథ్యంలో ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించింది. లాలూ జైల్లో ఉండటం, తేజస్వికి అనుభవం లేకపోవడంతో జేడీయూ, బీజేపీ ప్రభంజనంలో ఆర్జేడీ కొట్టుకుపోతుందని భావించిన వారికి తేజస్వి తన చాతుర్యంతో రాష్ట్రంలోనే అత్యధిక స్థానాల్లో విజయం అందించారు. అయినా తన తండ్రికి బద్ధ శత్రువులైన బీజేపీ, జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అసెంబ్లీలోనూ, వీధుల్లోనూ అధికార పక్షాన్ని తూర్పారబట్టి తన సమర్ధతను చాటుకున్నారు. ఈ నాటకీయ పరిణామాలకు ముందు ఆదివారం కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి నితీశ్ సర్కారుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిరోధ్
మార్చ్‌ను విజయవంతంగా నిర్వహించారు. తన నాయకత్వంలో రాష్ట్రంలో విపక్షాలన్నీ పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని ఈ ర్యాలీ ద్వారా నిరూపించారు.
క్రికెట్‌లోనూ మంచి ప్రావీణ్యం
1989 నవంబరు 9వ తేదీన జన్మించిన తేజస్వి.. లాలూ 9 మంది సంతానంలో అతి చిన్నవాడు. అయినా.. రాజకీయాలపై తేజస్వికి ఉన్న తపన, పోరాట పటిమను చూసిన లాలూ తన రాజకీయ వారసుడిగా నియమించారు. తేజస్విని లాలూ కుటుంబ సభ్యులు తరుణ్ అనే ముద్దుపేరుతో పిలుస్తారు. చండీగఢ్‌కు చెందిన తన స్నేహితురాలు రాచెల్ ఐరిస్‌ను 2021లో పెళ్లి చేసుకున్న తేజస్వి తర్వాత ఆమె పేరును రాజశ్రీ యాదవ్‌గా మార్చారు. 9వ తరగతిలోనే చదువు మానేసిన తేజస్వి క్రికెట్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. అండర్-15 క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీతో కలిసి ఆల్‌రౌండర్‌గా ఎదిగారు. వరల్డ్ కప్ సాధించిన భారత అండర్-19 క్రికెట్ జట్టులోనూ ఆయన సభ్యుడు. 2015లో 25 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరారు. అనతి కాలంలోనే తండ్రి వారసుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి రాజకీయ మైదానంపై బ్యాటింగ్ ప్రారంభించారు.
తండ్రి వారసుడిగా..
తన తండ్రికి ప్రీతిపాత్రుడైన తేజస్వి తన వయసు కంటే ఎక్కువ పరిపక్వతను ప్రదర్శించి అనతి కాలంలోనే ఆర్జేడీకి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినా 2020 ఎన్నికల్లో ఒంటి చేత్తో పోరాడి పార్టీకి అత్యధిక స్థానాలు అందించారు. అధికారానికి దూరంగా ఉన్నా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మనస్సు చూరగొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూడకుండా అవకాశం లభించగానే చతురతతో వ్యవహరించి ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. ఐదేళ్ల క్రితం ఆర్జేడీ నుంచి అధికారాన్ని లాక్కున్న బీజేపీ నుంచి తేజస్వి మళ్లీ అలాగే అధికారాన్ని కైవసం చేసుకొని తగిన బుద్ధి చెప్పారని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.