జెండావందనం నియమాలు పాటిస్తున్నారా..
భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్రతా వజ్రోత్సవాలు జరుపుకోబోతున్న కారణంగా ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం మనందరకూ తెలిసినదే. ఇంతకు పూర్వం కేవలం పాఠశాలల్లోనూ, కార్యాలయాలల్లోనూ, అసెంబ్లీల ఆవరణలోనూ మాత్రమే జెండా వందనం జరిగేది. కానీ ప్రభుత్వం మువ్వన్నెల పతాకాన్ని దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలని, జాతీయ పండుగను ఘనంగా జరపాలని ఆదేశించింది. అందుకని మన ఇష్టం వచ్చినట్లుగా త్రివర్ణ పతాకాన్ని వాడుకోవడానికి లేదు. రాజ్యాంగం ప్రకారం జాతీయ జెండాను ఎగురవేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుని ఆచరిద్దాం.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట మనం జెండాను ఎగుర వేసేటప్పుడు ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలు పాటించాలి. దీన్ని ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం శిక్షలు, జరిమానాలకు గురవుతాము. జాతీయ జెండాను అవమానించినా, అగౌరవపరచినా, 3 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది.
జెండా వందన సమయంలో దానికి సమానంగా కానీ, దానికన్నా ఎత్తులో కానీ ఇతర పార్టీల, మతపరమైన జెండాలు ఉంచకూడదు. జాతీయజెండాను నేలపై పడవేయకూడదు. వస్తువులపై, భవనాలపై జెండాను కప్పకూడదు. దానికి ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. మీటింగులలో, సమావేశాలలో స్టేజ్‌కి కుడివైపున మాత్రమే జెండాను నిలబెట్టాలి. త్రివర్ణపతాకాన్ని అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలి.
జెండా చిరిగిపోయి కానీ, నలిగిపోయి కానీ, మాసిపోయి కానీ ఉండకూడదు. అశోకచక్రం, మూడు రంగులు తప్ప దానిపై ఇంకేమీ రాతలూ, రంగులూ ఉండకూడదు. పైన కాషాయ రంగు , కిందివైపు ఆకుపచ్చ రంగు ఉండాలి. తిరగబడిన జెండాను ఎగుర వేయకూడదు. తెలిసింది కదా.. మరి మన మువ్వన్నెల జెండాకి ఏమాత్రం అగౌరవం కలుగకుండా జెండావందనానికి తయారు అయిపోదామా..