సంక్షోభంలో విద్యార్థి సంక్షేమం
తెలంగాణలో ప్రకటనలు ఒకటి, అమలు మరోటి
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యం
2025-26, 2026-27లలో సంక్షోభంలో విద్యార్థుల సంక్షేమం
గడిచిన 4 ఏళ్ల బకాయిలు రూ.10,000 కోట్ల నుంచి రూ.12,000 కోట్లు
ఫీజు బకాయిలపై తెలంగాణ హైకోర్టులో 89 రిట్ పిటిషన్లు
డీబీటీ విధానం తెచ్చినా.. నిధుల విడుదల కాలపట్టికపై స్పష్టత లేదు
విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు, స్టూడెంట్ కిట్ల పంపిణీపై సందిగ్థత
జీవో-9లోని కొన్ని నిబంధనలపై కోర్టు మధ్యంతర స్టే
విద్యార్థుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రస్తుతం అనేక ప్రశ్నల నడుమ నిలిచింది. ఒకవైపు వేల కోట్ల రూపాయల బకాయిలు, మరోవైపు స్కాలర్‌షిప్‌ల జాప్యం, గురుకుల విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీల చెల్లింపులో ఆలస్యం, యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ల పంపిణీపై స్పష్టత లేకపోవడం… ఇవన్నీ కలిసి ప్రభుత్వ విద్యా విధానంపై సందేహాలు పెంచుతున్నాయి. దీనికి తోడు జీవో-9పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.తెలంగాణ విద్యా కమిషన్ 2025-26 నివేదిక ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ఫీజుల నియంత్రణ, స్కాలర్‌షిప్‌ల బలోపేతం, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడం వంటి కీలక సిఫార్సులు చేసింది. విద్యార్థి సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాలని కూడా సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఆ సిఫార్సులకు పూర్తి భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యా కమిషన్ అంచనా ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గత నాలుగేళ్లలో రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బలహీనపరిచేందుకే జీవో-9 తీసుకొచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రతిపక్ష ఆరోపణలు కాగా, ప్రభుత్వం ఈ విమర్శలను ఖండిస్తూ డీబీటీ విధానం ద్వారా పారదర్శకత తీసుకొస్తున్నామని చెబుతోంది.అయితే ప్రభుత్వం ప్రకటించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజు మొత్తాన్ని ముందుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, వారు కళాశాలలకు చెల్లించాలనే విధానం అమల్లోకి వచ్చినా, నిధుల విడుదలకు స్పష్టమైన కాలపట్టిక లేకపోవడం విద్యార్థులు, కళాశాలలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే కారణంగా రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా, సుమారు 89 రిట్ పిటిషన్లు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.
హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. “జీరో ఫీజు” విధానం కొనసాగిస్తామని చెబుతూ, రీయింబర్స్‌మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీసింది. తుది తీర్పు వచ్చే వరకు కళాశాలలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర అనుమతి ఇవ్వడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. జీవో-9లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించడం కూడా ప్రభుత్వ నిర్ణయాలపై తలెత్తిన న్యాయపరమైన సందేహాలకు నిదర్శనం.మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన యంగ్ ఇండియా పాఠశాలలు, విద్యా సంస్కరణలు, గురుకుల అభివృద్ధి వంటి అంశాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న పాఠశాలలకు పేర్లు మార్చడం మినహా కొత్తగా ఆశించిన స్థాయిలో మౌలిక వసతులు, విద్యా విస్తరణ కనిపించడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
విద్యార్థుల సంక్షేమ పథకాలు రాజకీయాల కంటే ఎక్కువగా భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అందువల్ల ప్రభుత్వం విద్యా కమిషన్ సిఫార్సులను వేగంగా అమలు చేయడం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయడం, హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం అత్యవసరం. లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తుపై ఏర్పడిన అనిశ్చితి మరింత పెరిగే ప్రమాదం ఉంది.
-వెంకటేశ్వర్లు బోయ

