Breaking Newshome page sliderHome Page SliderInternational

తప్పనిసరి అయితే తప్ప ఇరాన్‌కు వెళ్లొద్దు


భారత్‌ అడ్వైజరీ

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ముగింపు ప్రకటన వచ్చినప్పటికీ, పశ్చిమాసియాలో ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారత ఎంబసీ తన ప్రయాణ మార్గదర్శకాలను (అడ్వైజరీ) సవరించింది. ప్రస్తుతానికి ఇరాన్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తున్నప్పటికీ, తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు భారత పౌరులెవరూ ఆ దేశానికి అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. అనివార్య కారణాల వల్ల వెళ్లాల్సి వస్తే.. తప్పనిసరిగా ఎంబసీ అధికారులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

ఇరాన్‌లోని భద్రతా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అక్కడ ఉన్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలు పాటిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ ట్విట్టర్ వేదికగా కోరింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. కీలక అంశాలపై ఇంకా భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. దెబ్బతిన్న అణు కేంద్రాల పరిశీలనకు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ఇన్‌స్పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్‌ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించగా.. టెహ్రాన్‌ దాన్ని తీవ్రంగా ఖండించింది. అటు హర్మూజ్‌ జలసంధి మూసివేతపై కూడా రెండు పక్షాల మధ్య పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనల మధ్య భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.