పాక్‌పై డ్రోన్లతో తాలిబన్ దాడి
పాకిస్తాన్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ దళాలు డ్రోన్లతో దాడులు నిర్వహించాయి. ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ఐసిస్ -కే) ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని చేపట్టినవని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో పౌరులపై దాడులకు, విద్రోహ చర్యలకు ఈ స్థావరాల నుంచే ప్రణాళికలు రూపొందుతున్నాయని తాలిబన్లు ఆరోపించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓ పాఠశాలను ఐసిస్ రహస్య స్థావరంగా ఉపయోగిస్తోందని, అందుకే దానిపై దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ సభ్యులు మృతిచెందగా, పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించగా, వాటికి ప్రతీకారంగానే తాజా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పాక్ దాడుల్లో 28 మంది పౌరులు మృతిచెందగా, 49 మంది గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం మృతుల సంఖ్య 38గా పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆఫ్ఘన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించే చర్య అని, ప్రాంతీయ శాంతికి ముప్పుగా మారుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

