116 ఏళ్ల భక్తురాలికి శ్రీవారి ప్రత్యేక దర్శనంటీటీడీ చైర్మన్ ఎక్స్‌లో ప్రకటన!
తిరుమల (ఏడీఎన్ఎన్) – కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మెట్ల మార్గం గుండా ఎంతో ఓపికతో కొండపైకి చేరుకున్న ఆమె అచంచల భక్తి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై పలువురు భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, 116 ఏళ్ల వయస్సులోనూ శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన ఆ వృద్ధురాలి భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. భక్తిని గౌరవించే క్రమంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఆ వృద్ధ భక్తురాలి పూర్తి వివరాలు తమ వద్ద అందుబాటులో లేవని, ఆమె గురించి సమాచారం తెలిసిన వారు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని బీఆర్ నాయుడు కోరారు. వివరాలు లభించిన వెంటనే ఆమెకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఆ వృద్ధ భక్తురాలిపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. టీటీడీ చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా శ్రీవారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ భక్తురాలి సంకల్పం, భక్తి అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

