కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందాన్ని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, కార్యకర్తలతో కలిసి కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులకు నీళ్లు విడుదల చేయకుండా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. తాము రాజకీయాల కోసం రాలేదని, సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతోనే వచ్చామని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉందని, మేడిగడ్డతో సంబంధం లేకుండానే ఇక్కడి నుంచి నీటిని తరలించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమను అడ్డుకుంటోందని విమర్శించారు.
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సాగునీరు ఇస్తే యూరియా సరఫరా చేయాల్సి వస్తుందని, పంటలు బాగా పండితే ధాన్యం కొనాల్సి వస్తుందనే కారణంతోనే నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే సాగునీరు అందించవచ్చని, కేసీఆర్ ప్రభుత్వం అదే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని గుర్తుచేశారు.
కాళేశ్వరం అనేది కేవలం ఒక బ్యారేజీ కాదని, మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 1,531 కిలోమీటర్ల కాలువలతో కూడిన భారీ ప్రాజెక్టు అని కేటీఆర్ వివరించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నా వినియోగించడం లేదని ఆరోపించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.94 వేల కోట్లు ఖర్చయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల గోడ కూలడం, వట్టెం పంప్‌హౌస్ దెబ్బతినడం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం వంటి ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానానికి చేరిందని, రైతు ఆత్మహత్యలు కూడా తగ్గాయని తెలిపారు.
పెంబర్తి, జనగామ, పరకాల, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు తమ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, కార్యకర్తల మద్దతుతో ముందుకు సాగామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం, కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణ కోసం ఎంతదూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. వెంటనే కన్నెపల్లి పంపులను ప్రారంభించి మిడ్ మానేరు ప్రాజెక్టును నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

