రాజాసింగ్ నిర్దోషి: కోర్టు
గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌కు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఊరట లభించింది. హైదరాబాద్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఆరోపణలు నిరూపితం కాలేదని కోర్టు స్పష్టం చేసింది. 2022లో నమోదైన ఈ కేసులో రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
2022లో ఓ స్టాండప్ కమెడియన్ నిర్వహించిన షోను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో వివాదానికి దారితీసింది. ఆ వీడియో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని స్థానిక కోర్టు తొలుత రిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ, అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా ప్రత్యేక కోర్టు అనుకూల తీర్పు ఇవ్వడంతో రాజాసింగ్‌కు చట్టపరంగా కీలక ఊరట లభించింది.

