పోలీసులపై ఎన్హెచ్ఆర్సి సీరియస్
సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రాజేష్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి ) తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై మూడు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.
రాజేష్‌ను పోలీసులు ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారంటూ న్యాయవాది రామారావు ఇమ్మినేని చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్హెచ్ఆర్సి విచారణ ప్రారంభించింది.
ఈ కేసుకు సంబంధించిన పోస్ట్‌మార్టం వీడియో, పోస్ట్‌మార్టం నివేదిక, మేజిస్ట్రియల్ విచారణ వివరాలు, వైద్య పత్రాలు, దర్యాప్తు రికార్డులతో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీసుకున్న చర్యల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.
ఇక బాధిత కుటుంబం ఈ ఘటనను కస్టడీ హత్యగా పేర్కొంటూ, బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్హెచ్ఆర్సి జోక్యంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

