Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

సింగరేణిపై మోదీ ఫోకస్

సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి లాభాల బాట పట్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. తాడిచర్ల -II బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిని నిర్లక్ష్యం చేశాయని, వారి విధానాల వల్లే సంస్థ అప్పుల్లో కూరుకుపోయి కార్మికులు అనిశ్చితిని ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు.

ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కృషి ఫలితంగానే ఎలాంటి వేలం ప్రక్రియ లేకుండా తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణికి కేటాయించారని రాంచందర్ రావు తెలిపారు. ఈ బ్లాక్‌లో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాబోయే 40 నుంచి 50 ఏళ్ల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు.

ఈ కేటాయింపుతో సింగరేణికి సుమారు రూ.2,550 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని, రాయల్టీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని వెల్లడించారు. అలాగే 1,200 మందికి పైగా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.