కేసులు పెట్టినా వెనక్కి తగ్గం: హరీష్ రావు
కరీంనగర్: అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని, కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నా, రాజకీయ కారణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను చేపట్టడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడం కంటే కేసీఆర్‌పై విమర్శలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తనపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. తమ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, తమపైనే కేసులు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపేనన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పార్టీ నేతలు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని హరీష్ రావు సూచించారు. ఓట్లు గల్లంతు కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

