Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ భేటీ

ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 10 జన్‍పథ్‍ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలను రాహుల్ గాంధీకి వివరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రధానంగా చర్చలు జరిగాయి.

రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి మహేశ్ కుమార్ గౌడ్ సమగ్ర సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా, మండల కమిటీల ఏర్పాటు, బీఎల్‌ఓల నియామకాలు , అనుబంధ సంఘాల భర్తీ ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో వివరించారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర కులగణన పూర్తి చేసి, అధికారిక సమాచారాన్ని వెల్లడించిన విషయాన్ని రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా వివరించారు. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా చేర్చాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరగా, అందుకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ భేటీ కంటే ముందు మాజీ ఎంపీ వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ కూడా రాహుల్ గాంధీని కలిశారు.