ప్రధాని మోదీతో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ భేటీ… ఏమన్నారంటే?
ఇండియాను చూస్తే ఎన్నడూ లేనంత ఆశావాదం కలుగుతోంది!
కరోనా వ్యాక్సిన్ పంపిణీ అద్భుతమన్న గేట్స్
కోవిన్ ద్వారా కోట్ల మందికి చేర్చడం అమోఘమని కితాబు
డిజిటల్ చెల్లింపులతో అద్భుతాలు చేశారంటూ ప్రశంసలు
బిల్ గేట్స్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమైనప్పుడు ఆరోగ్య రంగంలో భారతదేశంలో వినూత్నంమగా పనిచేస్తోందని, వాతావరణ మార్పు, భారతదేశం G20 ప్రెసిడెన్సీ, ఇతర కీలకమైన అంశాలపై చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బ్లాగ్‌లో తెలిపారు. భారతదేశం చాలా సురక్షితమైన, ప్రభావవంతమైన, సరసమైన వ్యాక్సిన్‌లను తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని గేట్స్ ప్రశంసించారు. వాటిలో కొన్నింటికి గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుందన్నారు. వ్యాక్సిన్‌లు మిలియన్ల మందిని కాపాడాయన్నారు. మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లు జీవితాలను రక్షించాయని… ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధులను నిరోధించాయన్నారు.

కొత్త లైఫ్‌సేవింగ్ టూల్స్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, వాటిని డెలివరీ చేయడంలో భారతదేశం రాణిస్తోందన్నారు బిల్ గేట్స్. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కో-విన్‌లోని ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 2.2 బిలియన్ల కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్‌లను డెలివరీ చేసిందన్నారు. ఇది బిలియన్ల కొద్దీ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడానికి ప్రజలను అనుమతించిందని… డిజిటల్ డెలివరీ చేయడానికి దోహదకారి అయ్యిందన్నారు. టీకాలు వేసిన వారికి ధృవపత్రాలు ఇవ్వడం అద్భుతమన్నారు. కో-విన్ ప్రపంచానికి ఒక నమూనా అని ప్రధాని మోదీ విశ్వసించారు, నేను దానిని అంగీకరిస్తున్నానని బిల్ గేట్స్ చెప్పారు. మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులను స్వీకరించినందుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు భారతదేశాన్ని ప్రశంసించారు. 200 మిలియన్ల మంది మహిళలతో సహా కనీసం 300 మిలియన్ల మందికి అత్యవసర డిజిటల్ చెల్లింపులు అందాయన్నారు.

ఆర్థిక సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తీసుకొచ్చిన డిజిటల్ ఐడి ఆధార్, డిజిటల్ బ్యాంకింగ్ కోసం వినూత్న ప్లాట్‌ఫారమ్‌లతో సత్ఫలితాలిచ్చాయన్నారు. ప్రభుత్వాలు మెరుగ్గా పని చేయడంలో డిజిటల్ సాంకేతికత ఎలా సహాయపడుతుందో చెప్పడానికి గతి శక్తి కార్యక్రమం గొప్ప ఉదాహరణ అని చెప్పారు గేట్స్. రైలు, రోడ్లతో సహా 16 మంత్రిత్వ శాఖలను డిజిటల్‌గా కలుపుతోందని… మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రణాళికలను ఏకీకృతం చేయవచ్చన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల పనిని వేగవంతం చేయవచ్చన్నారు. దేశంలో అభివృద్ధి చెందిన ఆవిష్కరణలు ప్రపంచానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో హైలైట్ చేయడానికి… ఇతర దేశాలు వాటిని స్వీకరించడంలో సహాయపడటానికి భారతదేశం G20 అధ్యక్ష బాధ్యతలు ఉపకరిస్తాయని… ఇది ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశమని గేట్స్ అన్నారు. ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణంలో భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి గతంలో కంటే ఎక్కువ ఆశాజనకంగా ఉన్నానంటూ, గేట్స్ బ్లాగ్‌ను ముగించారు. ఇన్నోవేషన్‌లో పెట్టుబడులు పెడితే ఏది సాధ్యమో ఇండియా చేసి చూపించిందన్నారు. భారతదేశం ఈ పురోగతిని కొనసాగిస్తుందని, ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని కోరుకుంటున్నానన్నారు.

