కేజ్రివాల్ కు వదిలేస్తావా?.. జైలులో మగ్గిపోతావా?
తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను జైలులో ఉన్నప్పుడు ‘కేజ్రివాల్ కు వదిలేస్తావా?.. లేదంటే జైలులో మగ్గిపోతావా?’ అని అల్టిమేటం జారీ చేశారన్నారు. జైలులో తాను ఇబ్బందులు పడుతున్న విషయం బీజేపీకి అర్థమైందని, దీనికి తోడు తన భార్య అనారోగ్యం బారినపడటం, కుమారుడు చదువుకుంటున్నాడని తెలిసి తనకు ఈ ఆఫర్ ఇచ్చారని సిసోడియా చెప్పారు. బీజేపీలో చేరితే ఆప్ కూటమిని విచ్ఛిన్నం చేస్తామని, ఆ తర్వాత తనను సీఎంను చేస్తామని చెప్పారని వివరించారు. దీనికి అంగీకరించకుంటే సుదీర్ఘకాలంపాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట వినకుంటే బీజేపీ జైలుకు పంపుతుందని సిసోడియా విమర్శించారు.

