Home Page SliderNews AlertPoliticsTelangana

తెలంగాణలో ఇంధన సెగకు కారణం ఇదే

తెలంగాణలో గత కొన్ని రోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ధరలు భారీగా పెరగబోతున్నాయనే వదంతుల వల్లే ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. బంకుల వద్ద అకస్మాత్తుగా డిమాండ్ పెరగడంతో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ప్రధానంగా మూడు కారణాలను ప్రభుత్వం గుర్తించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ధరలు పెరుగుతాయనే ప్రచారం ఒకటైతే, పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 150 కి చేరడంతో ఆ వినియోగదారులు కూడా సాధారణ బంకులపై ఆధారపడటం రెండో కారణం. ఇక ఏపీ, మహారాష్ట్ర వంటి సరిహద్దు రాష్ట్రాల వాహనాలు కూడా తెలంగాణలోనే ఇంధనం నింపుతుండటంతో వినియోగం అనూహ్యంగా పెరిగింది.ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సరఫరాను సాధారణం కంటే 126 శాతం పెంచినట్లు మంత్రి వెల్లడించారు. చమురు కంపెనీల సమన్వయంతో 3,100 ట్యాంకర్లను నిరంతరం ఇంధన రవాణా కోసం రంగంలోకి దించారు. మే 27వ తేదీ నాటికి డీజిల్ సరఫరాను 151 శాతానికి, పెట్రోల్ సరఫరాను 95 శాతానికి పెంచి నిల్వలను క్రమబద్ధీకరించారు.