Breaking NewsHome Page Sliderhome page sliderNational

కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

అరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం షాక్ ఇచ్చింది. అరావళి కొండల గుర్తింపు నిబంధనలలో మార్పులు చేస్తూ కేంద్రం సమర్పించిన ప్రతిపాదనలతో పాటు, నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది . చుట్టుపక్కల భూమి నుంచి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండలను మాత్రమే అరావళిగా పరిగణించాలన్న కేంద్రం నిర్ణయం పర్యావరణానికి ముప్పుగా మారుతుందని పర్యావరణవేత్తలు వ్యక్తం చేసిన ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై తదుపరి ఆదేశాల వరకు అరావళి పరిధిని మార్చే ఏ ప్రయత్నాన్నైనా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉండి, ‘ఇండియన్ అమెజాన్ ఫారెస్ట్’గా పిలువబడే ఈ పర్వత పంక్తులు వాతావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, కొండల గుర్తింపు ప్రమాణాలను మారిస్తే మైనింగ్ మాఫియాకు అవకాశం ఇచ్చినట్లవుతుందని పిటిషనర్లు వాదించారు. అయితే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే బయట ప్రకటనలు చేయడంపై పిటిషనర్ల తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ఈ వివాదాస్పద అంశంపై జనవరి 21వ తేదీన సమగ్ర విచారణ చేపడతామని, అప్పటిలోగా కేంద్ర ప్రభుత్వం మరియు పర్యావరణవేత్తలు తమ తుది అభిప్రాయాలను తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.