Home Page SliderNewsNews AlertTrending Today

సూపర్ ఎల్‌నినోపై శాస్త్రవేత్తల హెచ్చరిక

రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రారంభించాలని భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ (IITM) శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ సూచించారు. కొన్ని రోజుల పాటు కురిసే అతిభారీ వర్షాలు నెలల తరబడి కొనసాగుతున్న వర్షాభావాన్ని తీర్చలేవని, అవి వరదలకే కారణమవుతాయని ఆయన హెచ్చరించారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల్లో ముందస్తు ప్రణాళికలు అవసరమన్నారు.

ప్రస్తుతం దేశంలో రుతుపవనాలు అస్థిరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. జూన్‌లో సాధారణం కంటే భారీ వర్షలోటు నమోదైనా, జులైలో కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. అయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సగటు కొంత మెరుగ్గా కనిపించినా, జిల్లాల వారీగా చూస్తే వర్షాభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఈ ఏడాది రుతుపవనాల తీరు విభిన్నంగా ఉందని, కొన్ని వారాలు వర్షాలు లేకపోయి, ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. దీంతో ఒకవైపు వరదలు, మరోవైపు కరువు పరిస్థితులు ఒకేసారి కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసినా భూగర్భ జలాలు, నేలలో తేమ వెంటనే పెరగవని, ఖరీఫ్ సాగుపైనా దీని ప్రభావం పడుతోందన్నారు. దేశవ్యాప్తంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి సాగు తగ్గగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా విత్తనాలు ఆలస్యమయ్యాయని వివరించారు.

వాతావరణ మార్పులు, సముద్రాల వేడెక్కడం వల్ల ఎల్‌నినో మరింత బలపడుతోందని రాక్సీ తెలిపారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భారత రుతుపవనాలు బలహీనమవుతున్నాయని చెప్పారు. అయితే బలహీన రుతుపవనాలున్నా, తక్కువ సమయంలోనే అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో తీవ్రత గత రికార్డులను మించే స్థాయికి చేరే అవకాశముందని, అందుకే దీనిని సూపర్ ఎల్‌నినోగా అభివర్ణిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో తీవ్రమైన వడగాలులు, అధిక రాత్రి ఉష్ణోగ్రతలు, పంట దిగుబడుల తగ్గుదల, నీటి కొరత, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. రిజర్వాయర్ల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణ, స్వల్పకాల పంటల ప్రోత్సాహం, ఆరోగ్య శాఖలు, విద్యుత్ సంస్థలు, విపత్తు నిర్వహణ యంత్రాంగం ముందస్తు సన్నద్ధతతో ఉండాలని సూచించారు.

అలాగే ఈ ప్రభావం సెప్టెంబరు తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. తక్కువ వర్షపాతం వల్ల భూగర్భ జలాల రీఛార్జి తగ్గి, రబీ పంటలు, తాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చన్నారు. బలమైన ఎల్‌నినో కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, 2027 సంవత్సరం ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి సంవత్సరాల రికార్డులను అధిగమించే అవకాశం ఉందని రాక్సీ మాథ్యూ కోల్ హెచ్చరించారు.