BusinessNational

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పదేపదే నిబంధనలను ఉల్లంఘించడం, హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలు ప్రజా ప్రయోజనాలకు, ముఖ్యంగా డిపాజిటర్ల ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. బ్యాంకు నిర్వహణలో లోపాలు ఉన్నాయని, ఇదే తీరు కొనసాగితే ఖాతాదారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం లైసెన్స్ రద్దుతోనే ఆగకుండా, పేటీఎం పేమెంట్స్ బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియను ఆర్‌బీఐ వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సంబంధిత హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. దీంతో పేటీఎం బ్యాంక్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ చర్యలు అకస్మాత్తుగా జరిగినవి కావు. 2022 నుంచే పేటీఎంపై ఆర్‌బీఐ నిఘా పెంచింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని గతంలోనే ఆదేశించడమే కాకుండా, మార్చి 2024 నుంచి వాలెట్లు, ఫాస్టాగ్, ఎన్‌సీఎమ్‌సీ కార్డుల్లో టాప్-అప్‌లను పూర్తిగా నిలిపివేసింది. కేవైసీ నిబంధనల ఉల్లంఘనలు ప్రధాన కారణంగా నిలిచాయి. బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు బ్యాంకు వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం పాత డిపాజిట్ల విత్‌డ్రాయల్స్‌కు మాత్రమే అవకాశం ఉంది. కొత్త డిపాజిట్లను స్వీకరించడంపై నిషేధం కొనసాగుతుంది. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలో 2017లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమవడంతో చివరికి మూసివేత దశకు చేరుకుంది. డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థ, నిబంధనల ఉల్లంఘన కారణంగా ఇప్పుడు తన ఉనికిని కోల్పోనుంది.