పంజాబ్ సీఎం తాగి విమానం ఎక్కారా..?
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ జర్మనీలో ఫూటుగా తాగి విమానం ఎక్కారా..? నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో విమానం నుంచి కిందకు దించేశారా..? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ గడ్డపై మన దేశ పరువు తీశారా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఈ నెల 17వ తేదీన జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున వాస్తవమేంటో లుఫ్తాన్సా విమానయాన సంస్థ వెల్లడించాలని చెప్పారు.

నిజానికి ఆరోజు ఏం జరిగింది..?
జర్మనీలో పర్యటించిన భగవంత్ సింగ్ మాన్ సోమవారం ఢిల్లీకి బయల్దేరారు. అయితే.. ఆయన ఫుల్లుగా తాగి విమానం ఎక్కారని.. నడవలేని స్థితిలో ఆయన్ను సిబ్బంది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్టులో విమానం నుంచి కిందకు దించేసిందని వార్తలొచ్చాయి. దీని వల్ల ఆయన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యమైందని మీడియా కథనాలు ప్రచురించింది. భగవంత్ సింగ్ మాన్ విదేశీ గడ్డపై పంజాబీల పరువు తీశారని శిరోమణి అకాలీదళ్ ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరింది.

పొంతన కుదరని లుఫ్తాన్సా, పంజాబ్ అధికారుల వివరణలు
అయితే.. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా బయల్దేరడం వల్లే ఫ్లైట్ మార్చాల్సి వచ్చిందని, అందుకే టేకాఫ్ ఆలస్యమైందని లుఫ్తాన్సా ట్వీట్ చేసింది. పంజాబ్ ప్రభుత్వ అధికారుల వివరణ మరో విధంగా ఉంది. భగవంత్ సింగ్ మాన్ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే విమానం నుంచి దిగిపోయారని, ఆరోగ్యం కుదట పడిన తర్వాత మరో విమానంలో ఢిల్లీ వచ్చారని అధికారులు తెలిపారు. పంజాబ్ సీఎంను ప్రతిష్ఠను దిగజార్చేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విపక్షాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురుదాడికి దిగింది.

