ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతల విమర్శనాస్త్రాలు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. మంగళవారం విచారణకు హాజరైన హరీశ్ రావుకు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇలాంటి ఆరోపణలతో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు.ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఇది పూర్తిగా అక్రమమైన కేసు అని విమర్శించారు. విపక్ష నేతల గొంతు నొక్కడమే లక్ష్యంగా ప్రభుత్వం తన సమయాన్ని వృధా చేస్తోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ధ్వజమెత్తారు.
ఈ కేసులో హరీశ్ రావుకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే అత్యున్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో వెలుగు చూసిన ‘బొగ్గు కుంభకోణం’ వంటి భారీ స్కామ్‌లను హరీశ్ రావు బయటపెట్టడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని, అందుకే ఈ పాత కేసును మళ్ళీ తెరపైకి తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీశ్ రావుకు రేవంత్ రెడ్డి ఇస్తున్న ‘రిటర్న్ గిఫ్ట్’ ఈ పోలీస్ నోటీసులేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం, న్యాయస్థానాల తీర్పులను కూడా లెక్కచేయకుండా వేధింపులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాటం ఆగదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

