Home Page SliderTelangana

ఒకప్పుడు పేపర్ బాయ్.. ఇప్పుడు ఎమ్మెల్యే..

Share with

రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అయితే అది నిజం కాదని నిరూపించాడు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ వెడ్మా బొజ్జు పటేల్ . పేపర్ బాయ్ టు ఎమ్మెల్యే వరకు ఎదిగిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ఆయనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చిన్న తనంలో చదువుతోపాటు పేపర్ బాయ్ గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పని చేశారు. అనంతరం ఐటీడీఏ పైసా చట్టం ఛైర్మన్గ్ గా ఎన్నికయ్యారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) లో సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2023 ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు అనూహ్యంగా గెలుపొందారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టం కట్టారు. వెడ్మ బొజ్జు నామినేషన్ లో తనకు సొంతిల్లు లేదని 8 లక్షల 42 వేల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్ గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసముంటున్నారు. వెడ్మ బొజ్జు జీవితం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.