గిరిజన హక్కులకు కొత్త చట్టం
విజయవాడ: గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులకు భంగం కలగకుండా జీవో -3 పునరుద్ధరణకు అవసరమైన చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో గిరిజన సంఘాల ప్రతినిధులు, ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో జీవో -3 అమలు, 1/70 చట్టం, భూహక్కులు, విద్య, ఉపాధి తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, 2000లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన జీవో -3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులకు కేటాయించారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో జీవో -3 రద్దుకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
యథాతథంగా జీవోను పునరుద్ధరిస్తే కోర్టులో నిలవదని, అందుకే చట్టపరమైన సవరణలతో బలమైన కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం ఐటీడీఏల పరిధిలో గిరిజన సంఘాలు, మేధావుల అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు.
గిరిజనుల భూహక్కులను పరిరక్షించే 1/70 చట్టం కొనసాగుతుందని, దీనిపై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు జీవో -3 పునరుద్ధరణకు పూర్తి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

