మునుగోడు లెటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్
మునుగోడులో మారుతున్న సమీకరణాలు
ప్రచారంలో దూసుకుపోతున్న కోమటిరెడ్డి
కలిసొస్తున్న వ్యక్తిగత ఇమేజ్‌తో అడ్వాంటేజ్
కాంగ్రెస్‌కు సెంటిమెంట్ వర్కౌటవుతుందా?
కూసుకుంట్ల టీఆర్ఎస్కు బలమా? బలహీనతా?
యువ ఓటర్ల ఎవరికి వేస్తారన్నదే కీలకం
రాజకీయ నాయకుడ్ని ఆశ మాత్రమే బతికిస్తుంది. రాజకీయ పార్టీలను భవిష్యత్ పై నమ్మకం మాత్రమే ముందుకు నడిపిస్తుంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడానికి కూడా కష్టమే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాలు వన్ సైడ్‌గా మారిపోయాయ్. కానీ ఏపీలో మాత్రం నువ్వా-నేనా అన్నట్టుగా ఉన్నాయ్. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న తెలుగు నేలలో గత రెండు టర్మ్‌ల్లో ఫలితాలు వన్ సైడ్‌గా వచ్చేశాయ్. కానీ ఈసారి తెలంగాణలో పరిస్థితి అలా కన్పించడం లేదని గత కొన్నాళ్లుగా వస్తున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడితే.. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు.. సారూ.. పదహారు.. గులాబీ పార్టీ కలలను కల్లలు చేసింది. ఇక ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఉపఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయ్. ఇక హుజూరాబాద్ దెబ్బ అదుర్స్ అన్నట్టుగా మొత్తం పరిణామాలు మారిపోయాయ్.

గత ఏడాది ఇంచుమించుగా ఇదే సమయంలో జరిగిన ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల సంచలన విజయాన్ని నమోదు చేసి.. అర్ధ, అంగ బలాలను ఎదిరించి నిలబడ్డాడు. ఇప్పుడు మరో సమరం తెలంగాణ గడ్డపై రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా కన్పిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కేక్ వాక్ అన్న ఫీలింగ్ ఎక్కడా కన్పించకుండా పోయింది. అడుగడుగునా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయ్. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులంతా, గులాబీ కండువా కప్పుకోవడం, కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి హస్తం పార్టీని కంగారు పెట్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాలన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయ్. ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొంది భారతీయ జనతా పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న ఆ పార్టీ ఆ తర్వాత ఈటల లాంటి దిగ్గజ నేతను పార్టీలోకి ఆహ్వానించి, కేసీఆర్‌కు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది.

ఇదంతా చరిత్ర అయితే వర్తమానంలో సైతం బీజేపీ మాస్ వ్యూహంతో అడుగులు వేస్తోంది. మునుగోడులో ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు, బీజేపీ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. మునుగోడు లాంటి కాంగ్రెస్ పార్టీ హోర్డ్ కోర్ సీట్లో గెలవడం అంతా వీజీయేం కాదు. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు. తెలంగాణ గెలవాల్సిందే అనుకుంటున్నప్పుడు మునుగోడు ఎంత.. గెలిస్తే ఏమవుతుంది.. ఓడితే ఏమవుతుంది అన్న అంచనాలు రెండూ లేకుండా ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందా అంటే చెప్పలేం. మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్.. రెండు పార్టీల్లో కలకలం రేపుతున్నాయట. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన కూసుకుంట్ల ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బలహీనంగా మారారంటున్నారు. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ నాయకులకు ఎంతోకంత అదనపు బలాన్నిస్తోంది. కానీ కూసుకుంట్ల విషయంలో నెగిటివ్.. పార్టీ పాజిటివ్‌ను తినేస్తోందంటున్నారు. నామినేషన్ సందర్భంగా ఆయన తడబాటు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉరుకులు పరుగులు పెడుతోంది. మహిళను ఎన్నికల బరిలో దించామంటూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున గెలిచిన వాళ్లలో ఎందరు పార్టీలో ఉన్నారంటే ఏం చెప్తారు? ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఒక రేంజ్లో తలబొప్పి కట్టేలా చేస్తోంది. సెంటిమెంట్ అంటే ఏంటో చూపిస్తామనుకుంటున్నా… అందుకు పరిణామాలు ఎంత మాత్రం అనుకూలంగా లేవు.

మొత్తంగా మునుగోడులో పెద్ద ఎత్తున ఉన్న యువత ఎటువైపు ఓటేస్తే ఏమవుతుంది… రాష్ట్రానికి ఏం జరుగుతుందన్నదానిపై లెక్కలు వేసుకుంటోంది. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు వివిధ ఏజెన్సీల సర్వేల్లో వచ్చిన ఫలితాలకు తాజాగా లభిస్తున్న పల్స్ పూర్తిగా మారిపోయాయన్న అభిప్రాయం స్పష్టమవుతోంది. అభ్యర్థిని ప్రకటిస్తే ఏం జరుగుతుందోనన్న కలవరంలో ఉన్న ఆ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తీసుకున్న స్టాండ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ఇలా ఇంకెందరు పార్టీ వీడుతారోనన్న టెన్షన్ ఎక్కువవుతోంది. గౌడ సామాజికవర్గం ఓట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉండటంతో.. పార్టీపై కసిగా ఉన్న నర్సయ్య గౌడ్ ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై అనుకూలత, మరొకరిపై ప్రతికూలత అన్నది ఇప్పటికైతే కన్పించడం లేదు. కానీ హుజూరాబాద్ ఎన్నికను టీవీల్లో వీక్షించిన మునుగోడు ఓటరు.. అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో ద్విముఖ పోటీలో ఈటల విజయం సాధిస్తే.. ఇక్కడ త్రిముఖ పోటీ అని అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో మునుగోడు గ్రౌండ్ తీర్పు సుస్పష్టంగా రాబోతుందని క్లారిటీ వచ్చేస్తోంది. మహిళలు, యువత ఈసారి గెలుపు ఓటములపై ప్రభావం చూపెడతారని చెప్పొచ్చు.

