ఢిల్లీకి కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు. వసంత్ విహార్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. టీఆర్ఎస్ .. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడవనున్నాయి. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం కూడా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆఫీసు ప్రారంభోత్సవం తర్వాత.. కేసీఆర్ గురువారం ఢిల్లీలోనే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు జాతీయ ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సీఎం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని సమాచారం.

