Home Page SliderInternationalNews

అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, కువైట్‌, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ, ఎంక్యూ-9 డ్రోన్ హ్యాంగర్, థాడ్ (THAAD) రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకారం, అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్లు చేపట్టామని తెలిపింది. జోర్డాన్‌లోని అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థతో పాటు సీ-రామ్ రాడార్, హెలికాప్టర్ మరమ్మతుల కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.

అలాగే ‘ఆపరేషన్ లైట్నింగ్’ పేరుతో కువైట్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగించినట్లు వెల్లడించింది. అలీ అల్ సలీం ఎయిర్‌బేస్‌లోని పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్, ఎంక్యూ-9 డ్రోన్ హ్యాంగర్‌పై దాడి చేసినట్లు, దోహా ప్రాంతంలోని ఆయుధాలు, లాజిస్టిక్స్ డిపోలను కూడా డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది.

అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనలపై అమెరికా నుంచి వెంటనే అధికారిక ధృవీకరణ లేదా స్పందన వెలువడలేదు. ఇరాన్ వెల్లడించిన నష్టాల వివరాలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యపడలేదు.