BusinessHome Page SliderInternationalNews Alert

పారిస్‌లో భారత స్టార్టప్‌ల మేళా

భారతదేశాన్ని అంతర్జాతీయ స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పారిస్‌లో నిర్వహించిన రోడ్‌షో ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారతీయ విశ్వవిద్యాలయాల ల్యాబ్‌లలో పుట్టిన వినూత్న ఆలోచనలు మరియు డీప్-టెక్ స్టార్టప్‌లను అంతర్జాతీయ పెట్టుబడిదారులతో అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. దీని కోసం ఇటీవల పారిస్‌లో నిర్వహించిన రోడ్‌ షో ఒక టీజర్‌లా పనిచేసింది. దీనిలో భారత రాయబార కార్యాలయం సిఐఐ (CII) సహకారంతో జరిగిన ఈ సమావేశంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ నెట్‌వర్క్‌లు, యూనివర్సిటీలు పాల్గొన్నాయి. సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ వంటి 13 కీలక సాంకేతిక రంగాలపై ఈ ఈవెంట్ దృష్టి సారిస్తోంది. ‘భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్’లో భాగంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.