Breaking Newshome page sliderHome Page SliderTelangana

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై హైకోర్టు కీలక తీర్పు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా, స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ, చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారిదేనని ధర్మాసనం మంగళవారం తేల్చి చెప్పింది.ఈ వివాదం గతంలో 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యంతో మొదలైంది. తన తండ్రిని ప్రత్యర్థి పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో, కోర్టు అప్పట్లో ఎన్నిక ప్రక్రియపై స్టే విధించింది. అయితే, స్టే ఉత్తర్వులు వచ్చే సమయానికే ఎన్నిక పూర్తయిందని, బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మెజారిటీ సాధించారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.రెండు పక్షాల వాదనలను క్షుణ్ణంగా విన్న హైకోర్టు ధర్మాసనం, ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని నిర్ణయించింది. మూడు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, నూతన పాలకవర్గాన్ని ప్రకటించాలని తుది ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది.