Breaking NewsHome Page Sliderhome page sliderInternational

మూడు దేశాలను మ్యాప్ లో ఆక్రమించాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం లేపారు. తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఆయన షేర్‌ చేసిన ఒక మ్యాప్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ మ్యాప్‌లో గ్రీన్‌లాండ్‌ను అమెరికా భూభాగంగా, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చూపించారు. దక్షిణ అమెరికాలోని వెనిజులాను కూడా అమెరికా ఆధీన ప్రాంతంలా చిత్రీకరించడం గమనార్హం. ఏఐ సాంకేతికతతో రూపొందించినట్లు కనిపిస్తున్న ఈ మ్యాప్‌తో పాటు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండా పాతినట్లు ఉన్న మరో ఫోటోను కూడా ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. ‘‘గ్రీన్‌లాండ్‌ – యూఎస్‌ టెరిటరీ, 2026లో స్థాపన’’ అనే క్యాప్షన్‌ దీనికి జోడించడంతో సంచలనానికి దారి తీసింది.

యూరప్‌ దేశాలతో గ్రీన్‌లాండ్‌ అంశంపై వివాదం నడుస్తున్న వేళ ఈ మ్యాప్‌ బయటకు రావడం ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్‌ కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేయాలంటూ ప్రతిపాదించారు. కెనడా ప్రభుత్వం దీనిని ఖండించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరింది.

వెనిజులాపై కూడా ట్రంప్‌ వెనకడుగు వేయకుండా పట్టు బిగిస్తున్నారు. ఇటీవల అమెరికా ప్రత్యేక బలగాలు వెనిజులాలో మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యను డ్రగ్స్‌ కేసుల్లో విచారణ కోసం న్యూయార్క్‌కు తరలించిన ఘటన కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాలన్నీ ట్రంప్‌ దూకుడు, విదేశాంగ విధానానికి నిదర్శనంగా మారుతున్నాయి.