Andhra Pradeshhome page sliderHome Page SliderPolitics

నేనెప్పుడూ మహిళలను కించపరచలేదు..


రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై తాను మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న ఆరోపణలను వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడూ మహిళలను అవమానించలేదని, కేవలం తనపై, తన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై గతంలో చేసిన విమర్శలను మాత్రమే తిప్పికొట్టానని స్పష్టం చేశారు. కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే మూడు రోజుల తర్వాత దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విపక్ష నేతలను ‘వాడు, వీడు’ అనడం ఎంతవరకు సమంజసమని అమర్నాథ్ ప్రశ్నించారు. గతంలో ఆమె విజయమ్మ, భారతిలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడినప్పుడు, వైఎస్ జగన్‌ను ‘నత్తి పకోడీ’ అన్నప్పుడు టీడీపీ నేతలకు ఎందుకు కనిపించలేదని నిలదీశారు. తాము సమాధానం చెప్పకపోతే ఆమె మరింత పెట్రేగిపోతారని, తన వ్యాఖ్యల ద్వారా ఉత్తరాంధ్ర సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నమే చేశానని, తన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.తండ్రి మరణం తర్వాత తల్లి చేతిలో పెరిగానని, తనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని అమర్నాథ్ తెలిపారు. చిన్నతనం నుంచే మహిళల మధ్య పెరిగిన వాడిగా వారి పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు. తన వ్యక్తిత్వం ఎలాంటిదో తమ పార్టీ మహిళా నేతలను అడిగితే చెబుతారని, గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, అనిత, చింతమనేని, బండారు సత్యనారాయణ వంటి నేతలు మహిళలపై చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు మళ్లీ బయటకు వస్తున్నాయని గుర్తుచేశారు.తనపై రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేసుకున్నా తాను భయపడేది లేదని, తగ్గేదే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని, మరోసారి విమర్శలు రిపీట్ అయితే అదే స్థాయిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో యువకుడు సాయికృష్ణను రక్షక భటులే లాకప్‌లో కొట్టి చంపిన ఘోర ఉదంతం నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి ప్రభుత్వం తనపై బురదజల్లుతోందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.