Home Page SliderNational

‘100% ఫ్రూట్ జ్యూస్’ కాన్సెప్ట్‌కు మంగళం

నల్లని వన్నీ నీళ్లు కావు.. తెల్లనివన్నీ పాలు కావు.. మారుతున్న ప్రపంచంలో ఏది అసలు, ఏది నకిలీయో అర్థం కాక ప్రజలు తలపట్టుకుంటున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావడం, పంట కాలాన్ని తగ్గించి, సైన్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా శాస్త్రవేత్తల పరిశోధలనకు భిన్నంగా కొందరు లాభాపేక్షతో వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వంద శాతం స్వచ్ఛమైనవంటూ ప్రకటనలు గుప్పిస్తూ వినియోగదారులను చీట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయ్. అలాంటి వాటిలో ముఖ్యమైనది ప్రజల ఆరోగ్యాని దెబ్బతీస్తున్న ఫ్రూట్ జ్యూస్‌ల ప్రకటనలపై FSSAI జూలు విదిల్చింది. ఇకపై ఇష్టానుసారం ప్రకటనలు విడుదల చేయొద్దంది.


ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ప్యాకేజ్డ్ జ్యూస్ ఉత్పత్తులలో ‘100 శాతం ఫ్రూట్ జ్యూస్’ అని ప్రకటించుకోడానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతమున్న వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లన్నింటిని ఎగ్జాస్ట్ చేయడానికి (తొలగించడానికి) 4 నెలల గడువిచ్చిందని పీటీఐ నివేదించింది. చాలా కంపెనీలు వంద శాతం ఫ్రూట్ జ్యూస్ అంటూ వినియోగదారులను మోసం చేస్తున్నాయని FSSAI ఆరోపించింది. ఇలాంటి ప్రకటనలతో కస్టమర్లు మోసపోతున్నారని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రచారాన్ని అంగీకరించబోమంది.

తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, వినియోగాదారుల సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. FSSAI ఈ ఏడాది జూన్‌లో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లు ఇష్టానుసారంగా 100% పండ్ల రసాల తయారు చేస్తున్న ప్రకటనలు ఆపేయాలని కోరింది. సెప్టెంబరు 1, 2024లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయాలని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (FBO)లను ఆదేశించింది. అయితే అప్పటికే తాము పెద్ద ఎత్తున ఆర్డర్లను సిద్ధం చేసుకున్నామని, అలా చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతామని సంస్థలు కోరడంతో గడువు పొడిగించాలని FSSAI నిర్ణయించింది.

“స్టేక్‌హోల్డర్‌ల నుండి అందిన వివిధ ప్రతిపాదనల తర్వాత, ముందుగా ముద్రించిన ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఉపయోగించడానికి గడువును పొడిగించాలని నిర్ణయించారు. ఈ మెటీరియల్‌లను ఉపయోగించుకోవడానికి ఇప్పుడు కొత్త గడువు డిసెంబర్ 31, 2024,” అని FSSAI, FBOలకు తెలిపింది. అంతేకాకుండా, డిసెంబర్ 31, 2024కి ముందు FBOలు తయారు చేసిన ఉత్పత్తులను “అన్ని మాధ్యమాల ద్వారా వాటి షెల్ఫ్ లైఫ్ ముగిసే వరకు మార్కెట్‌లో విక్రయించవచ్చు” అని FSSAI ఉపశమనం కలిగించింది.