‘దీదీ’దిగిపోవడం ఖాయం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్ రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పునకు సంకేతమని, దీదీ గద్దె దిగిపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తొలి దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో మెజారిటీ సీట్లను (110కి పైగా) భాజపా కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి వైపే బెంగాల్ ప్రజలు మొగ్గు చూపారని ఆయన పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చొరబాట్లు, అవినీతి, భయానక పాలనకు ముగింపు పలికి, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై వస్తున్న వదంతులకు అమిత్ షా తెరదించారు. బెంగాల్‌లో పుట్టి, బెంగాలీ భాష మాట్లాడే వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని, అది ఖచ్చితంగా ఒక బీజేపీ కార్యకర్తేనని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రతకు, యువత ఉపాధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని అమిత్ షా వెల్లడించారు.

