ముఖ్యమంత్రులు రాజులేం కాదు.. సీఎంపై సుప్రీం సీరియస్..
ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పోస్టింగ్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీరును సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమను తాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతలు అప్పగించిన ఐఎఫ్ఎస్ అధికారిపై శాఖాపరమైన విచారణ పెండింగ్ లో ఉందని.. అలాంటి అధికారిపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఎందుకని బెంచ్ ప్రశ్నించింది. మనం భూస్వామ్య యుగంలో లేమని.. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏమైనా చేయగలరా? అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మనం ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామనుకోవద్దని సుప్రీం గుర్తు చేసింది.
అసలు కేసు ఏమిటంటే..?
రాహుల్ అనే ఐఎఫ్ఎస్ అధికారి కార్పెట్ టైగర్ రిజర్వ్ కు హెడ్ గా ఉండేవారు. అయితే పులులు సంచరించే అడవిలో అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనుమతించారన్న ఆరోపణలతో రెండేండ్ల కిందట ఆయన్ని పదవీచ్యుతుణ్ని చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు అదే రాహుల్ ను రాజాజీ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా సీఎం ధామీ నియమించారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.