Home Page SliderTelangana

ఆమె మృతితో మాకెలాంటి సంబంధం లేదు..

పుష్ప -2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో సంధ్య థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ.. ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవతి మృతికి తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. థియేటర్ తమదే అయినప్పటికీ పుష్ప-2 ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా బందోబస్తు కల్పించాలని పోలీసులకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.