Home Page SliderTelangana

మోడీ కట్టిన ఇళ్లు.. కేసీఆర్ కట్టిన ఇళ్లు లెక్కలతో సహా చెప్పిన ఈటల

గొప్పలు చెప్పుకోడవడం తప్ప, చేతలేమున్నాయని సీఎం కేసీఆర్ పాలనను ఎండగట్టారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడున్నర కోట్ల ఇల్లు కడితే.. కేసీఆర్ కట్టిన ఇళ్లెన్నని ప్రశ్నించారు. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఉన్న ప్రధానులకు రాని ఆలోచన నాకే వచ్చిందని గొప్పలు చెప్పే కేసీఆర్… డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని ప్రగల్బాలు పలికి… పది లక్షలుని చెప్పి, చివరకు రెండు లక్షల 91 వేలు మంజూరు చేసి.. కట్టింది లక్షా 35 వేలేనని… పంచింది కేవలం 35 వేలనని లెక్కలతో సహా వివరించారు ఈటల. పేద ప్రజల సొంతింటి కలను దూరం చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా నేను భారతీయుణ్ణి అని గల్లా ఎగరేసుకొని చెప్పేలా చేసిన వారు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఈటల. భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దారని, చంద్రయాన్ ప్రయోగం, G20 సదస్సు ద్వా భారత్ సత్తా చాటారన్నారు. ఎక్కడ స్కాం లేకుండా.. అపకీర్తి లేకుండా.. శభాష్ అనే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. దేశమంతా మెచ్చుకుంటున్న విధానం కేసీఆర్, కేటీఆర్‌ కళ్లకు కనిపించడం లేదా? అంటూ ఈటల మండిపడ్డారు. దేశమంతా మోడీని శభాష్ అంటుంటే.. మళ్ళీ రావాలని కోరుకుంటుంటే.. గుడ్డి ద్వేషంతో.. అసూయతో ఆయన కీర్తిని ఓర్చుకోలేక సంకుచిత భావంతో వీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజలందరూ గమనించాలన్నారు.

తెలంగాణ గడ్డమీద ఏ వర్గం ప్రజలు, ఏ కులం ప్రజలు కూడా కేసీఆర్‌ను మంచి ముఖ్యమంత్రి అని, ఇది మంచి ప్రభుత్వమని అనడం లేదని ఈటల నిప్పులు చెరిగారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన పేదల భూములను, దేవాలయ భూములను, ఎవాక్యుఎటెడ్ భూములను ధరణి తీసుకువచ్చి కబ్జా కాలం తీసేసి… వేల వేల ఎకరాల భూములను వారి బంధుమిత్రులకు, బ్రోకర్లకు అప్పగించి అక్రమంగా డబ్బులు సంపాదించిన కుటుంబం కెసిఆర్ ఫ్యామిలీ అంటూ దుయ్యబట్టారు ఈటల. ఏం మొహం పెట్టుకొని వస్తావని మోడీని ఆ కుటుంబం ప్రశ్నిస్తోందన్నారు. అసలు నువ్వు ఏం మొహం పెట్టుకొని పాలిస్తావో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు ఈటల. పేదల భూములను లాక్కున్నది మీరేనని దుయ్యబట్టారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు డబ్బు సంచులతో తెలంగాణలో ఎన్నికలు కొట్లాడాలని చూస్తున్నారని… డబ్బు పెట్టీ, మద్యం పంచి నాయకులకు వెలగట్టి.. మళ్లీ గెలవాలని నీచమైన ప్రయత్నం చేస్తోంది కేసీఆరేనని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ చేసిన పనులు మాత్రమే చెప్తుంటే.. మీరు మాత్రం మీ బిడ్డను నన్ను ఆశీర్వదించాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఈటల. మీడియా చేతిలో పట్టుకొని హోర్డింగులతో, పేపర్లు, టీవీలతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారని… గుజరాత్, మహారాష్ట్రలో తెలంగాణ చెమట పైసలతో అడ్వటైజ్మెంట్స్ ఇస్తున్నారని ఆక్షేపించారు.