నిమ్స్ డైరెక్టర్ మనోహర్ నిర్వాహకం
వాళ్లు పేరుకు మాత్రమే ప్రభుత్వ వైద్యులు. బుద్ధంతా ప్రైవేటే. బాధ్యతలు కావాలంటారు.. ఆచరణ అసలుండదు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ మనోహర్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్‌గా ఉంటూ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. రెండు రోజుల క్రితం ఛాతీలో సమస్య రావడంతో డాక్టర్ మనోహర్ అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈసీజీ, 2డీఎకో పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో పూడిక ఉందని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయనకు ఇవాళ లేదంటే రేపు స్టంట్లు వేయడం గానీ… ఆపరేషన్ గానీ చేసే అవకాశముంది. డాక్టర్ మనోహర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అపోలో ఆస్పత్రిలో వైద్యులుగా ఉండటం వల్ల ఆయన అక్కడ చికిత్స చేయించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటూ వస్తోంది. మరీ ముఖ్యంగా హరీష్ రావు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైద్యుల నిర్లక్ష్యానికి తావివ్వకుండా చర్యలు చేపట్టారు. రోగులకు భరోసా ఇవ్వాల్సింది వైద్యులేనని మంత్రి హరీష్ రావును అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు కూడా. ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తూ… వైద్యులకు భరోసా సైతం ఇస్తున్నారు. కానీ ప్రభుత్వాస్పత్రుల్లో కీలక బాధ్యతల్లో ఉన్న అధిపతులు… వారు పనిచేస్తున్న ఆస్పత్రులను కాదని.. ప్రైవేటులో చికిత్స చేయించుకోవడం విడ్డూరంగా ఉందంటూ జనం మండిపడుతున్నారు. ప్రభుత్వ వైద్యులే ఇలా చేస్తే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోగ్య మంత్రి హరీష్ రావు వెంటనే జోక్యం చేసుకొని డాక్టర్ మనోహర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘన చరిత్ర ఉన్న నిమ్స్ ఆస్పత్రికి ఇలాంటి డైరెక్టర్‌ను నియమించారా..? అంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారు. బాధ్యతాయుతమైన వ్యవస్థలకు నేతృత్వం వహిస్తూ… ప్రైవేటు వైద్యంపై ఆకర్షితులయ్యారంటే… తాను బాధ్యతలు నిర్వహిస్తున్న నిమ్స్… అంతగా తీసిపోయిందా అంటూ మండిపడుతున్నారు. తక్షణం నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ను సస్పెండ్ చేయాలంటున్నారు. ఇలా చర్యలు తీసుకుంటే మిగతా వైద్యులు సైతం దారిలోకి వస్తారని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్యులే ప్రైవేటు చికిత్సలు చేయించుకుంటుంటే సామాన్యుడికి సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం ఏం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

