InternationalNews Alert

బ్రిటీష్ కొలంబియా సీఎం రేసులో త‌మిళ యువ‌తి

అంత‌ర్జాతీయంగా రాజ‌కీయాల్లో ప్ర‌వాస భార‌తీయుల హ‌వాన‌డుస్తోంది. విదేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అత్యున్న‌త స్థాయి ప‌ద‌వుల‌కు పోటీప‌డుతూ స‌త్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బ్రిటన్ ప్రధాని పీఠం కోసం భార‌త సంత‌తికి చెందిన రిషిసున‌క్ బ‌రిలో ఉన్నారు. ఈకోవ‌లోనే ఇప్పుడు కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ ముఖ్యమంత్రి పదవికి త‌మిళ‌నాడుకు చెందిన అంజలి అప్పాదురై పోటీ చేస్తున్నారు.

కెనడాలో 10 ప్రావిన్సులు ఉన్నాయి. ఒక్కో ప్రావిన్స్ కు వేర్వేరుగా ఎన్నికలు నిర్వ‌హిస్తారు. 2017లో బ్రిటీష్ కొలంబియాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో న్యూడెమోక్ర‌టిక్ పార్టీ విజ‌యం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్య‌మంత్రిగా జాన్ హోర్గ‌న్ ఎన్నిక‌య్యారు. అయితే క్యాన్స‌ర్ వ్యాధి బారిన‌ప‌డ్డ ఆయ‌న పార్టీ నాయ‌క‌త్వం నుంచి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. దీంతో పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి అంత‌ర్గ‌త ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి . న‌వంబ‌ర్ 13న ఈ ఎల‌క్ష‌న్స్ ప్రారంభం కానున్నాయి. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. ఈనేప‌థ్యంలో . బ్రిటీష్ కొలంబియా న్యాయ‌శాఖ మంత్రిగా ఉన్న డేవిడ్ ఎబి ఇందులో పోటీచేస్తున్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా అంజ‌లి అప్పాదురై ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు.పార్టీ అధ్య‌క్ష‌పీఠానికి ఎన్నికైన వాళ్లు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌కు ముఖ్య‌మంత్రి అవుతారు. అంజ‌లి ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. త‌న అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు ఆమె అలుపెరుగ‌క శ్రమిస్తున్నారు.

బ్రిటీష్ కొలంబియా సీఎం రేసులో ఉన్న అంజ‌లి అప్పాదురై స్వస్థలం త‌మిళ‌నాడు లోని మ‌ధురై. 1990లో జ‌న్మించిన ఆమె ఆరేళ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు అక్కడే పెరిగారు. త‌ద‌నంత‌రం ఆమె త‌ల్లిదండ్రులు కెన‌డాకు వ‌ల‌స‌వెళ్లారు.ఆమె విద్యాభ్యాస‌మంతా అక్కడే సాగింది. ప్రస్తుతం కోక్విట్లాం న‌గ‌రంలో అంజ‌లి కుటుంబం నివాసం ఉంటోంది. కెన‌డియ‌న్ క్లైమెట్ యాక్టివిస్ట్‌గా రాజ‌కీయ‌ వేత్తగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.